ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రత్యేకమైనది... కీలక పాయింట్లు ఇవే...
ప్రతిసారి లాగే... ఈసారి కూడా బడ్జెట్‌ను రూపొందించినది ఆర్థిక మంత్రే. కాకపోతే... తెరవెనక బడ్జెట్ ఎలా ఉండాలో పూర్తి డైరెక్షన్స్ ఇచ్చింది మాత్రం ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలే. ప్రధానంగా 2022 చివర్లో లేదా 2023 మొదట్లో వచ్చే జమిలి ఎన్నికల్లో మార్కులు కొట్టేయాలంటే... ఏం చెయ్యాలో ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం... అందుకు తగినట్లుగా... ఈ బడ్జెట్ నుంచే తాయిలాలు, వరాలు ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. వృద్ధి రేటు తగ్గిపోవడంతో... మనల్ని వెనక్కి నెట్టి... చైనా వృద్ధి రేటులో తొలిస్థానంలో నిలిచింది. ఈ బడ్జెట్‌తో వృద్ధి రేటును పెంచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అందుకే... ఇవాళ్టి బడ్జెట్... అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది.
బడ్జెట్‌పై కీలక పాయింట్లు :
* 2019 ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దానికి కొనసాగింపుగా ఇవాళ్టి బడ్జెట్ ఉంటుంది.
* ఈసారి బడ్జెట్‌పై ప్రజల్లో ఆశలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ పన్ను పరిమితి పెంచాలని ప్రజలు కోరుతున్నారు. తాత్కాలిక బడ్జెట్‌లో 5 లక్షల ఆదాయం వరకూ పన్ను మినహాయింపు ఉంది.
* బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్లలో వడ్డీ రూ.10 వేలు దాటితే... TDS కింద పన్ను వసూలు చేస్తున్నారు. TDSను రూ.50 వేలు దాటిన వారికే విధించాలనే డిమాండ్ ఉంది.
* ఇళ్ల రుణాల వడ్డీపై మినహాయింపు ప్రస్తుతం రూ.2 లక్షలు ఉంది. దాన్ని రూ.3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
* సెక్షన్ 80 (సీ) కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2లక్షలకు పెంచాలనే డిమాండ్ ఉంది.
* 60 ఏళ్ల లోపు వారికి ఆరోగ్య బీమాలో భాగంగా సెక్షన్ 80-డీ కింద ఇస్తున్న డబ్బును రూ.25వేల నుంచీ రూ.30వేలకు పెంచాలంటున్నారు.
* ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రతీ రైతుకూ ఏటా రూ.6వేలు ఇవ్వాల్సి ఉంది. దానికి ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాల్సి ఉంది.
* ప్రస్తుతం దేశంలో 6.1 శాతం నిరుద్యోగం ఉంది. దాన్ని సగానికి తగ్గించాలనే ప్రతిపాదనలున్నాయి.
* పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవడం ద్వారా రూ.90వేల కోట్లు రాబట్టాలని కేంద్రం భావిస్తోంది. దాని వల్ల ప్రైవేటీకరణ పెరిగే ప్రమాదం ఉంది.
* ఆర్థిక సర్వేలో చెప్పినట్లు ఇండియా... 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే... ఇప్పటి నుంచీ ఐదేళ్లలో వృద్ధి రేటు 8 శాతానికి చేరాలి. అది చాలా కష్టం.
* పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గాలని ప్రజలు కోరుతున్నారు. కానీ అమెరికా, ఇరాన్ వంటి దేశాల వాణిజ్య యుద్ధాలు, ఆంక్షల వల్ల చమురు ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
ఇలా ప్రతీ అంశంలోనూ కేంద్రం ఎలా ముందుకెళ్తుందన్నది సవాళ్ల ప్రయాణమే. ప్రధానంగా మోదీ మొదటిసారి ప్రధాని అయ్యాక... చివరి రెండేళ్లపాటూ లేని వృద్ధిరేటును 2 శాతం పెంచి చూపించారనీ, అది ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకర సంకేతమని కొందరు ఆర్థిక వేత్తలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రైతులు, నిరుద్యోగులు, యువత, పారిశ్రామిక రంగం, చిన్న మధ్య తరగతి వ్యాపారులు అందరూ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి వాళ్లందరికీ అనుకూలంగా నిర్మలా సీతారామన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇవాళ తేలనుంది.
Comments
Post a Comment