టాప్ 10 న్యూస్ - 9AM
1. నేడు పోలవరానికి ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో కొత్త ప్రభుత్వం అనుసరించనున్న వ్యూహం కీలకం కానుంది. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడమే తమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఆయన గురువారం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆ తర్వాత వ్యూహంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. జగన్ సీఎం అయ్యాక తొలిసారి పోలవరాన్ని సందర్శించనున్నారు.
2. ధూంధాంగా కాళేశ్వరం సంబురాలు
ప్రపంచంలోని అతి పెద్ద బహుళ ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సంబురాలను తెలంగాణవ్యాప్తంగా ఊరూవాడా నిర్వహించాలని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాల్లో రైతులు, ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలన్నారు. ఈనెల 27 నుంచి వచ్చే నెల 27 వరకు తెరాస సభ్యత్వ నమోదును పెద్దఎత్తున నిర్వహించాలని, సభ్యత్వం కోటి దాటాలని అన్నారు.
3. జులైలో గ్రూప్-2 ఇంటర్వ్యూలు
తెలంగాణలో గ్రూప్-2 ఇంటర్వ్యూల ప్రక్రియ జులై మొదటివారంలో ప్రారంభించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ అర్హులైనవారితో 1:2 జాబితాను రెండురోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు దాదాపు 2,000 మంది హాజరయ్యే అవకాశముందని, ఈ ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు రెండు నెలలు పడుతుందని వెల్లడించారు
4. భాజపాలో చేరేందుకు రంగం సిద్ధం
నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాదులోని తన నివాసంలో మునుగోడుకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన భేటీ అయ్యారు. తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని.. భాజపాలో కీలక పదవి వస్తుందని వారికి భరోసా ఇచ్చారు. పార్టీ మార్పిడిపై బహిరంగ ప్రకటన చేయాలనే నిర్ణయానికి వచ్చారు
5. భాజపాలోకి పలువురు తెదేపా నేతలు?
తెదేపాకు చెందిన కొందరు నేతలు భాజపాలో చేరతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. నలుగురు ఎంపీలతోపాటు గుంటూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లాకు చెందిన ఒక మాజీ ఎంపీ, కొందరు మాజీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. భాజపాలో చేరతారని ప్రచారం జరుగుతున్న ఈ నాయకుల్లో ఎవరూ ఆ విషయాన్ని ఇంతవరకూ ధ్రువీకరించ లేదు. అలాగని తాము భాజపాలోకి వెళ్లబోమని కరాఖండిగానూ చెప్పడం లేదు. భాజపాలో చేరాల్సిందిగా తమకు ఆహ్వానం వచ్చిన మాట వాస్తవమేనని కొందరు అంగీకరిస్తున్నారు
6. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ‘అమ్మ ఒడి’
తెల్లరేషన్ కార్డు ఉండి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ‘అమ్మఒడి’ పథకం వర్తిస్తుందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇవ్వనున్నామని, మిగిలిన పాఠశాలల్లో చదివే పిల్లలకు ఇచ్చే విషయమై ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రాష్ట్రంలో 44,417 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 37.29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు
7. స్వతంత్రతే న్యాయవ్యవస్థకు ఆత్మ
స్వతంత్రత న్యాయవ్యవస్థకు ఆత్మలాంటిదని సుప్రీంకోర్టు
న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి అభివర్ణించారు. ప్రజాకర్షక శక్తుల నుంచి వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలని సూచించారు. ప్రజలకు వ్యవస్థపై నమ్మకం లేకపోతే అది ఎప్పటికీ న్యాయం చేయలేదని అన్నారు. మంగళవారం రష్యాలోని సోచిలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) దేశాల ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఆయన ప్రసంగించారు
8. భారత విద్యాసంస్థలు భళా
ప్రపంచంలోనే అగ్రశ్రేణి విద్యాసంస్థలలో మూడు భారతీయ సంస్థలకు స్థానం లభించింది. ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐఎస్‌సీ బెంగళూరు.. ఈ మూడు సంస్థలు ప్రతిష్ఠాత్మకమైన క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకులలో అగ్రశ్రేణి 200 సంస్థలలో ఉన్నాయి. ‘క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2020’ని లండన్‌లో బుధవారం విడుదల చేశారు. అగ్రశ్రేణి 1000 ర్యాంకులలో భారతదేశానికి చెందిన ఓపీ జిందాల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం (జేజీయూ) సహా 50 కొత్త సంస్థలున్నాయి.
9. హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద పంపిణీ కేంద్రం
వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువులను ఒకటి రెండు రోజుల్లోనే అందించేందుకు ఇ-కామర్స్ సేవల సంస్థ అమెజాన్ హైదరాబాద్‌లో అతి పెద్ద పంపిణీ కేంద్రాన్ని నెలకొల్పింది. 20వేల చదరపు అడగుల విస్తీర్ణంలో వట్టినాగులపల్లిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్ శివార్లలోని ప్రాంతాల్లో అమెజాన్ వినియోగదార్లకు వస్తు పంపిణీ వేగవంతం అవుతుంది
10. కివీస్‌ను గెలిపించిన కెప్టెన్
గట్టిగా పోరాడినా, విజయావకాశాలు సృష్టించుకున్నా దక్షిణాఫ్రికాకు మరో ఓటమి తప్పలేదు. ఈ ప్రపంచకప్‌లో అజేయ రికార్డును కొనసాగించిన న్యూజిలాండ్.. బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించారు. డసెన్ (67 నాటౌట్), ఆమ్లా (55) రాణించడంతో మొదట దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 241 పరుగులు చేసింది. విలియమ్సన్ (106 నాటౌట్), గ్రాండ్‌హోమ్ (60) పోరాడడంతో లక్ష్యాన్ని న్యూజిలాండ్ 48.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Comments
Post a Comment