రూ.10 నాణేల చెల్లుబాటు వివాదం...బస్ డిపో మేనేజర్ సస్పెన్షన్

పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా..ప్రజల వైఖరిలో మాత్రం మార్పురావడం లేదు. పది రూపాయల నాణెం తీసుకునేందుకు చిన్నచిన్న దుకాణదారులు మొదలుకొని, సూపర్ మార్కెట్ల వరకు నిరాకరిస్తున్నారు. బస్సుల్లోనూ వీటిని తీసుకునేందుకు ససేమిరా అంగీకరించడం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంటోంది. రూ.10 నాణేలు చెలామణిలో ఉన్నా...అవి చెల్లుతాయో లేదోనన్న అనుమానంతో వీటిని తీసుకునేందుకు వ్యాపారులు కూడా నిరాకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రూ.10ల నాణేలను ప్రభుత్వ బస్సుల్లో తీసుకోకూడదంటూ కండెక్టర్లకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసిన తమిళనాడుకు చెందిన ఓ బస్ డిపో మేనేజర్ ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రయాణీకులు రూ.10 నాణెలు ఇస్తే తీసుకోవద్దంటూ తిరుప్పూర్ బస్ డిపో మేనేజర్ దనపాల్ ఈ నెల 21న కండెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు. ఆ మేరకు కండెక్టర్లు ఆ నాణెలు తీసుకునేందుకు నిరాకరిస్తుండడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. అటు డిపో మేనేజర్ సర్క్యులర్‌ను ఫోటో తీసిన ఓ వ్యక్తి...ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్స్ తీవ్రంగా స్పందించారు. పది రూపాయల నాణేల చెల్లబాటును నిర్ణయించడానికి బస్ డిపో మేనేజర్‌కు ఎవరు అధికారాలిచ్చారని ప్రశ్నించారు. దనపాల్ ఆదేశాలు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంకావడంతో ఆయన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

దీనిపై స్పందించిన దనపాల్...కండెక్టర్లు చెల్లించే రూ.10ల నాణెలను తీసుకునేందుకు బ్యాంకులు నిరాకరిస్తుండడంతో ఆ రకమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అటు రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ...పది రూపాయణ నాణెల చెల్లుబాటుపై ప్రజల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దనపాల్ ఇచ్చిన ఆదేశాలకు, రవాణా శాఖకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. స్వయంగా ఆయన కండెక్టర్లకు ఆ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?