సిగరెట్ తాగుతూ పోలీసులకు దొరికిపోయిన హీరో రామ్.. ఆపై రూ. 200 ఫైన్..
ఇస్మార్ట్ శంకర్ చిత్ర షూటింగ్ ఇప్పుడు చార్మినార్ ఏరియాలో జరుగుతుంది. పక్కా పాతబస్తీ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఇందులో హీరోకు డబుల్ దిమాక్ ఉంటుంది. కాస్త ప్రయోగాత్మక కథతోనే ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాడు పూరీ. వరస ఫ్లాపుల్లో ఉన్న ఈయన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొడతానని ధీమాగా చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో రామ్ సిగరెట్ తాగుతూ పోలీసులకు కనిపించాడు. అయితే అది ఆయన కావాలని చేసింది కాదు.. సినిమా షూటింగ్‌లో భాగంగానే రామ్ సిగరెట్ తాగుతున్నాడు. అయితే అది నో స్మోకింగ్ జోన్ కావడంతో అసలు సమస్య వచ్చింది. ఒకవేళ షూటింగ్ కోసం స్మోక్ చేయాలన్నా కూడా దానికి పోలీస్ పర్మిషన్ ఉండాలి. అయితే షూటింగ్ కోసం అనుమతి తీసుకున్నా కూడా స్మోకింగ్ కోసం తీసుకోలేదు.
దాంతో చార్మినార్ సిఐ రామ్‌కు COTPA Act 2003 Section 4 కింద 200 రూపాయల ఫైన్ వేసాడు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఛార్మి కౌర్ పూరీ కనెక్ట్స్‌తో కలిసి పూరీ టూరింగ్ టాకీస్ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 18న విడుదల కానుంది ఈ చిత్రం. ముందుగా జులై 12 అనుకున్నా కూడా వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతో వారం వాయిదా వేసారు దర్శక నిర్మాతలు.
Comments
Post a Comment