2021లోనూ రోజాకు నిరాశేనా... అప్పుడు కూడా మంత్రి పదవి ఇవ్వరా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో కచ్చితంగా ఉంటారనుకున్న ఎమ్మెల్యే రోజా మంత్రి కాలేకపోయారు. ఇందుకు సామాజిక కారణాలు అడ్డుగా నిలిచాయన్న ప్రచారం సాగింది. ఆమెకు అన్యాయం జరిగిందని మీడియా కోడై కూయగా... అధినేత జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తానన్న రోజా... తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమెకు... నామినేటెడ్ కోటాలో APIIC ఛైర్మన్ పదవి దక్కింది. ఆ పదవిలో కొనసాగుతున్న రోజా... అదే సమయంలో... నగరి ఎమ్మెల్యేగా అక్కడి ప్రజల సమస్యలపైనా ఫోకస్ పెడుతున్నారు. అదే సమయంలో... కామెడీ షో జబర్దస్త్‌లో కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇలా రోజా మంత్రి పదవి చేపట్టకపోయినా... మంత్రుల లాగే ఫుల్ బిజీ అయిపోయారు.

రోజాకు త్వరలో మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్ధమవుతున్నారని తెలిసింది. వైసీపీ అధికారంలోకి రావడానికి కీలక హామీలైన నవరత్నాలను సక్రమంగా అమలు చెయ్యాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం ముందు ఉంది. పథకాల అమలు సక్రమంగా లేకపోయినా, అవినీతి జరిగినా, లబ్దిదారులకు ప్రయోజనం కలగకపోయినా... అది జగన్ పాలన, వైసీపీ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందువల్ల పథకాల అమలు బాధ్యతల్ని రోజాకు అప్పగిస్తారని తెలుస్తోంది. కొంతమంది అధికారులను ఆమెకు అప్పగించి... ఆమె పర్యవేక్షణలో పథకాల అమలు జరిగేలా చెయ్యాలని జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. ముక్కుసూటిగా మాట్లాడుతూ, ఫైర్ బ్రాండ్‌లా వ్యవహరించే రోజా అయితే... పనులు పక్కాగా జరిగి, సరైన ఫలితాలు వస్తాయని పార్టీ హైకమాండ్ లెక్కలేసుకుంటున్నట్లు తెలిసింది.

మంత్రి పదవి లేనట్లేనా? : నిజంగా నవరత్నాల అమలు బాధ్యతను రోజాకు అప్పగిస్తే... ప్రభుత్వంలో జగన్ తర్వాత అత్యంత బిజీగా మారే నేత రోజా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా విధులు నిర్వహిస్తున్న ఆమెకు... నవరత్నాల అమలు మరో భారీ కర్తవ్యం అవుతుంది. ఇన్ని పనుల్లో తలమునకలయ్యే ఆమె... 2021లో జరిగే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకోవడం కష్టమవుతుందనే వాదన వినిపిస్తోంది. మంత్రి పదవి కంటే నవరత్నాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే జగన్... ఆమెను అవే బాధ్యతలు నిర్వహించమని కోరే అవకాశాలున్నాయి.

సామాజిక సమీకరణలు కూడా మరోసారి రోజాకు హ్యాండిచ్చే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. చిత్తూరు నుంచి రెడ్డి సామాజిక వర్గం అయిన పెద్దిరెడ్డి అప్పుడు కూడా రేసులో ఉంటారు. ఆయనకు తోడు... భూమన కరుణాకర్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీళ్లలో ఎవరు పార్టీకి వ్యతిరేకంగా మారినా... అది వైసీపీకి ఆ జిల్లాలో పట్టుకోల్పోయేలా చేస్తుంది. అందుకే వీళ్లను దాటి జగన్... రోజాకు మంత్రి పదవి ఇవ్వలేరన్న వాదన బలపడుతోంది. అందువల్ల రోజాకు మంత్రి పదవి దక్కకపోయినా... అంతకు మించిన బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితి ఉంటుందనే అంచనాలున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?