గ్రామ వాలంటీర్లలో 50శాతం మహిళలే.. అర్హతలు, విధివిధానాలు.. చివరి తేదీ, డిటెయిల్స్..

 ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కేటగిరీల వారీగా రిజర్వేషన్‌, విధివిధానాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహ్న రెడ్డి ఆమోదం తెలిపారు. గ్రామవాలంటీర్లలో స్థానికులకే అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించనున్నారు. పట్టణాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో పదో తరగతిని అర్హతగా నిర్ణయించారు. 18–35 ఏళ్ల మధ్య వయస్సు వారే అర్హులు. ఎంపికకు మండల, పట్టణ స్థాయిలో అధికారుల కమిటీలు ఉంటాయి. జూలై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 11 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపికైన వారి జాబితాను ఆగస్ట్ 1న వెల్లడిస్తారు. వారికి ఆగస్ట్ 5 నుంచి 10 వరకు శిక్షణ ఇస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం నుంచి వారు విధుల్లో చేరతారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరి ఇంటి వద్దకే డోర్‌ డెలివరీ చేయడం ఈ గ్రామవాలంటీర్ల విధి. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమిస్తారు. గ్రామం, పట్టణ వార్డులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా వలంటీర్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. నియామకంలో రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ప్రతి కేటగిరీలోనూ సాధ్యమైనంత వరకు 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తారు.

బేస్‌లైన్‌ సర్వే ఆధారంగా 50 ఇళ్ల గ్రూపుల ఏర్పాటు బేస్‌ లైన్‌ సర్వే ఆధారంగా గ్రామం, వార్డులో ఉన్న కుటుంబాలను 50 చొప్పున ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో ఎంపీడీపీ, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీల కమిటీనే గ్రామాల వారీగా 50 ఇళ్ల గ్రూపులను కూడా వర్గీకరిస్తుంది. పట్టణాల్లో 50 ఇళ్ల గ్రూపులను మున్సిపల్‌ కమిషనర్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, మరొక సీనియర్‌ అధికారితో కూడిన కమిటీ వర్గీకరిస్తుంది. గ్రూపుల వర్గీకరణ తర్వాత గ్రామ, వార్డు స్థాయిలో 50 ఇళ్లకన్నా తక్కువ సంఖ్యలో కుటుంబాలు మిగిలిపోతే వారిని ఆ గ్రామం, వార్డులోని గ్రూపులతో సర్దుబాటు చేస్తారు.

వలంటీర్ల నియామకానికి గ్రామం, మున్సిపల్‌ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో మండలంను యూనిట్‌గా ఆ మండల పరిధిలో నియమించే వలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని, ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు.

ఆన్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటినీ పట్టణ స్థాయిలో మున్సిపల్‌ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో జరుగుతుంది.
అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు.

మండల, పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికున్న తెలివితేటలు, అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వ్యూలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి.

వాలంటీర్లగా ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుంది.ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. తనకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా పని చేయాలి.

తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ–వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పని చేయాలి. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో, సంబంధిత సమస్య పరిష్కారంలో సంధానకర్తగా వ్యవహరించాలి. వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పని చేయాలి.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు, ఇతరత్రా సహాయం పొందిన కుటుంబాల జాబితాను తన వద్ద రికార్డు రూపంలో ఉంచుకోవాలి.​​​తన పరిధిలోని 50 కుటుంబాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా.. విద్య, ఆరోగ్య పరంగా ఎప్పటికప్పుడు వారికి చైతన్యం కలిగించాలి. వృత్తి నైపుణ్యాల గురించి తెలియజేస్తుండాలి. తన పరిధిలోని ఇళ్లకు సంబంధించి రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి అవసరాల పరిష్కారం కోసం పనిచేయాలి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?