కళ్లు మూసుకోండని నాపైనా ఒత్తిడి..’ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులకు సంబంధించి నియమించిన నిపుణుల కమిటీతో సమావేశం సందర్భంగా ఆయన తనకు ఎదురైన పరిస్థితి వివరించారు. ‘ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదు. టెండర్ల విధానం అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. చెడిపోయిన వ్యవస్థను బాగుచేసుకోవడానికి తపిస్తున్నా. కళ్లు మూసుకోండని నాపైనా ఒత్తిడి తెచ్చారు. అలా చేయదలుచుకోలేదు కాబట్టే అవినీతిపై పోరాటానికి సిద్ధమయ్యా. ఇలాంటి స్కాంలను సమర్థించలేం.’ అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినా చూసీ, చూడనట్టు ఉండాలని, కళ్లు మూసుకుపోవాలంటూ జగన్ మీద ఒత్తిడి తెచ్చింది ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీఎం జగన్ మీద కూడా ఒత్తిడి తెచ్చేంత స్థాయి ఎవరికి ఉంది? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే, అది జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద వచ్చిన ఒత్తిడి గురించి చెప్పారా? లేకపోతే సీఎం అయిన తర్వాత కూడా ఎదురైన సంఘటన గురించి వారితో పంచుకున్నారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదు. రూ.100ల పని రూ.80లకే పని జరుగుతుందంటే రివర్స్ టెండరింగ్‌కు వెళ్దాం. అలాంటి అధికారులను సన్మానిస్తాం. మన ప్రభుత్వం పారదర్శకత దేశానికి ఒక ఆదర్శం కావాలి. అందుకోసమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును కోరాం.
పోలవరం పనుల్లో అక్రమాలు నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీకి వైఎస్ జగన్ సూచించారు. పోలవరంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్‌టెండరింగ్‌కు ఎక్కడ అవకాశం ఉందో గుర్తించాలన్నారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసిందని, స్పిల్‌వే పూర్తిచేయకుండా కాఫర్ డ్యాంకు వెళ్లారని, దాన్ని కూడా పూర్తిచేయకుండా వదిలేశారని జగన్ విమర్శించారు. ఫలితంగా గోదావరిలో వెడల్పు తగ్గిందని, ఇప్పుడు సడన్‌గా వరదలు వస్తే నాలుగు నెలలు పనులు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. పోలవరం తనకు అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టు అని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Comments
Post a Comment