ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ సర్కారుకు తలనొప్పి.. ఆ నిర్ణయం తీసుకుంటే..
ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఓ అడుగు ముందుకేసి సెప్టెంబరు రెండో వారంలోపే ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఇదే ప్రకటన తెలంగాణ సర్కారుకు తలనొప్పిగా మారింది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందున ఇక్కడ కూడా సంస్థను విలీనం చేయాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఈ నెల 25న అన్ని బస్సు డిపోల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా భద్రత కల్పించి, వారితో సమానంగా వేతనాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మెకు సంబంధించి 27 రోజుల వేతన సొమ్మును కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపించారు. పదవీ విరమణ పొందిన వారికి పీఎఫ్ సొమ్మును చెల్లించడం లేదన్నారు. అసలు ఆర్టీసీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే ఆర్టీసీ రూ.3,200 కోట్ల అప్పుల్లో ఉందని, ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలు రావడం లేదని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఏడాదిన్నరగా ఎండీ పోస్టు ఖాళీగా ఉందని, మూడు ఈడీ పోస్టుల్లో ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారని వివరించారు. ఇప్పటికీ ఆర్టీసీ బోర్డు చైర్మన్, సభ్యులను నియమించలేదని తెలిపారు.
Comments
Post a Comment