చెన్నైలో నీటి కొరత నానాటికీ తీవ్రంగా మారుతోంది
తమిళనాడు రాజధాని చెన్నైలో నీటి కొరత నానాటికీ తీవ్రంగా మారుతోంది. వర్షాలు లేక, రిజర్వాయర్లు ఎండిపోయి చుక్క నీరు కూడా దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. చెన్నై వాసుల దుస్థితిపై ప్రముఖ హాలీవుడ్ హీరో, పర్యావరణ వేత్త లియోనార్డో డికాప్రియో విచారం వ్యక్తం చేశారు. ఎండిపోయిన బావి నుంచి నీరు తోడుకునేందుకు ప్రజలు పడుతున్న అవస్థలను ప్రతిబింబించే ఫొటోను డికాప్రియో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో పాటు నీటి కష్టాలపై ఓ అంతర్జాతీయ మీడియా రాసిన కథనాన్ని కూడా రీషేర్ చేశారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నైని వర్షాలు మాత్రమే కాపాడాలి. చెన్నైలో ప్రధాన రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోవడంతో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కోసం ప్రభుత్వ ట్యాంక్‌ల వద్ద గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఎదురైంది. నీటి కొరతతో నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతబడ్డాయి. నీటి కోసం ప్రభుత్వాధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం వర్షాలు కురవాలని వేడుకుంటున్నారు’ అని డికాప్రియో తన పోస్టులో పేర్కొన్నారు.
కాగా.. భారత్‌లోని పరిస్థితులపై డికాప్రియో స్పందించడం ఇదే తొలిసారి కాదు. రెండు రోజుల క్రితం దిల్లీలోని ఘాజీపూర్ డంపింగ్ యార్డ్ గురించి కూడా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఘాజీపూర్‌లో చెత్త పేరుకుపోయి తాజ్‌మహల్ ఎత్తును దాటేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై డికాప్రియో విచారం వ్యక్తం చేశారు.
Comments
Post a Comment