జగన్ దెబ్బకు ఇల్లు ఖాళీ చేయబోతున్న చంద్రబాబు..
వైసీపీ సర్కార్ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సిద్దపడటంతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన నివాస మార్పుపై దృష్టి పెట్టారు. ప్రజా వేదిక కూల్చివేతతో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలు అంటూ.. చంద్రబాబు ఉండవల్లి నివాసం కూడా ఆ జాబితాలో ఉందని జగన్ పరోక్ష సంకేతాలిచ్చారు. మంత్రులు, వైసీపీ నేతలు సైతం చంద్రబాబు నివాసం అక్రమం అని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ తన నివాసాన్ని కూల్చివేసే చర్యలు మొదలుపెట్టకముందే.. గౌరవప్రదంగా తానే ఖాళీ చేస్తే మంచిదనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. గుంటూరు-విజయవాడలకు అందుబాటులో ఉండేలా కొత్త నివాసాన్ని ఏర్పరుచుకోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్దండరాయునిపాలెంకి
చెందిన కొంతమంది టీడీపీ నేతలు.. ఆయనకు ఇంటి స్థలం ఇవ్వడానికి కూడా ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త ఇంటిని నిర్మించుకుంటారా? లేక ఇప్పటికే నిర్మాణం పూర్తయిన మరో ఇంటిలోకి షిఫ్ట్ అవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
నిజానికి చంద్రబాబు నివాసానికి సంబంధించి కోర్టులో ఇంకా కేసు నడుస్తూనే ఉంది. కోర్టు కేసులో ఉన్న ఇంటిని కూల్చివేసేందుకు ప్రభుత్వం సిద్దపడకపోవచ్చు.అయితే చంద్రబాబు ఇంటిని కూల్చివేసేందుకు న్యాయపరమైన చిక్కులను కూడా చేధించే పనిలో జగన్ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ప్రజా వేదిక కూల్చివేత అనంతరం తదుపరి టార్గెట్ చంద్రబాబు నివాసమే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తానే ఇంటిని ఖాళీ చేసి మరో చోటుకు మారాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మొత్తానికి జగన్ దెబ్బకు చంద్రబాబు తన ఇంటిని ఖాళీ చేయబోతున్నారన్నమాట.
Comments
Post a Comment