తెదేపా కార్యకర్తలపై దాడులు అమానవీయ చర్య
తెదేపా కార్యకర్తలపై దాడులు అమానవీయ చర్య - రాయపాటి రంగారావు
గుంటూరు: - రాష్ట్రంలో అనేకచోట్ల టిడిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులు అమానవీయ చర్యలని దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు పేర్కొన్నారు.
మంగళవారం నాడు గుంటూరులో ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాయపాటిరంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల నాటి నుండి తెదేపా కార్యకర్తలపై జరిపిన దాడిలో కొంత మంది చనిపోగా, అనేకమంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడి ఇప్పటికికూడా చికిత్స పొందుతున్నారన్నారు.
నరసరావుపేట, మాచర్ల, గురజాల, చిలకలూరిపేట వంటి అనేక నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ప్రజాస్వామ్యంలో ఇది ఏమాత్రం మంచిది కాదని రంగారావు పేర్కొన్నారు.
తమ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని వారికి తాము అండగా నిలబడతామని ఆయన తెలిపారు.
ప్రజాస్వామ్యంలో పార్టీల గెలుపోటములు అనేవి సహజమని, కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగు పరచాలి అనేదానిమీద దృష్టి పెట్టాలి తప్ప దాడులతో ఏం సాధిస్తారో చెప్పాలన్నారు.
హోం మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన వారైనా కూడా జిల్లాలోని వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో దాడులు అధికంగా జరగటం, రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై హోంమంత్రి ప్రకటన చేసి 24 గంటలు గడవకముందే అనంతపురం జిల్లా సింగనమల లో రైతుల పంటల పై దాడి జరగటం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రజల్లో ఆందోళన నెలకొందని, దీనిపై హోంమంత్రి దృష్టిసారించాలని రంగారావు కోరారు.
2014 నాటినుండి నేటి వరకు కూడా టిడిపి ప్రజా సంక్షేమ మరియు అభివృద్ధి పై దృష్టి పెట్టిందే తప్ప ఏనాడు కూడా దాడులను మరియు హత్యలను ప్రోత్సహించలేదని, నేర చరిత్ర ఉన్న వారిపై తెలుగుదేశం ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన విషయం గుర్తు లేదా అన్నారు.
కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాడులపై నోరు మెదపకపోవడం దురదృష్టకరమన్నారు.
ఇక మీదట కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని దీనిని తాము సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Comments
Post a Comment