వారానికి ఒక రాత్రి గ్రామాల్లో నిద్ర చేయాలి..కలెక్టర్లకు జగన్ ఆదేశం
ఇకపై ప్రతి వారానికో రాత్రి అధికారులు గ్రామాల్లో నిద్రచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు గ్రామాల్లోని సంక్షేమ హాస్టళ్ళు, హాస్పిటళ్లు, స్కూళ్లలో నిద్ర చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఉండవల్లి ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన జగన్... గ్రామాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. రాత్రిళ్లు అక్కడే నిద్రచేయడం వలన స్థానికంగా ఉన్న పరిస్థితులు, సమస్యలు తెలుస్తాయని... తద్వారా సౌకర్యాల కల్పనకు వీలుంటుందని తెలిపారు.
అధికారులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా వెళ్లి నిద్ర చేయాలి. అక్కడున్న పరిస్ధితులు మీకు తెలుస్తాయి. తద్వారా అవసరమైన సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేసే వీలుంటుంది. అధికారులు అకస్మిక తనిఖీకి వెళ్లెప్పుడు అవసరమైన దుప్పట్లు, బెడ్‌లు మాత్రమే తీసుకెళ్లాలి. తనిఖీ చేసే చోట ఏమీ ఏర్పాట్లు చేయించుకోవద్దు. బాత్ రూమ్‌లు, క్లాస్‌రూమ్‌లు, ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా పరిశీలించి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి.
విద్యా, వైద్యం ఆరోగ్యం తన ప్రాధాన్యతా అంశాలని స్పష్టంచేశారు జగన్. గ్రామస్తులతో రచ్చబండ ఏర్పాటుచేసి వారి అవసరాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకుని.. సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు గ్రామాల్లో నిద్రచేయడం వలన గ్రామస్ధాయిలో మౌలిక వసతులు మెరుగు పడతాయన్నారు జగన్. అధికారుల స్థాయిలో వీలుకాకపోతే అవసరమైన వాటికి తాను నిధులు కేటాయిస్తానని స్పష్టంచేశారు.
Comments
Post a Comment