భాజపా బుధవారం సీతాపూర్ జైలుకి వెళ్లి అత్యాచార నిందితుడు, భాజపా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌ను కలిశారు.
లఖ్‌నవూ (ఉత్తర్‌ప్రదేశ్): ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించిన భాజపా నేత సాక్షి మహారాజ్ బుధవారం సీతాపూర్ జైలుకి వెళ్లి అత్యాచార నిందితుడు, భాజపా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘కుల్దీప్ చాలా కాలంగా జైలులో ఉంటున్నారు. ఆయన చాలా ప్రజాదరణ కలిగిన నేత. ఎన్నికల్లో గెలిచిన నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చాను’’ అని వ్యాఖ్యానించారు. ఉన్నావ్ అత్యాచార కేసు 2017లో కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఉద్యోగం కోసం జూన్ 4, 2017న తన వద్దకు వచ్చిన 17 ఏళ్ల బాలికను కుల్దీప్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) గతేడాది ఆయనకు వ్యతిరేకంగా ఛార్జిషీటు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120బి, 363, 366, 376 (1), 506 కింద ఆయనపై కేసులు ఉన్నాయి. అంతేగాక పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైంది. ఆయనను గతేడాది ఏప్రిల్‌లో సీబీఐ అరెస్టు చేసింది
Comments
Post a Comment