అధికారంలో లేనప్పుడు అక్రమం - అధికారంలో ఉంటే సక్రమం - ప్రజావేదికపై టీడీపీ, వైసీపీలది ఒకే దారి
ఏపీలో ఇదివరకటి టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడకు దగ్గర్లోని ఉండవల్లి వద్ద కృష్ణానది కరకట్టపై ఉన్న... పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన గెస్ట్ హౌస్‌ను మాజీ సీఎం చంద్రబాబు లీజుకు తీసుకుని తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. కృష్ణానది ప్రవాహానికి అతి దగ్గర్లో ఉన్న ఈ గెస్ట్ హౌస్ సహా కొన్ని నిర్మాణాలను అక్రమ కట్టడాలుగా గుర్తించి కూల్చివేయాలని గతంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గట్టిగా డిమాండ్ చేసేవారు. మీడియా ప్రతినిధులను సైతం కృష్ణానదిలో బోటు మీద తీసుకెళ్లి మరీ వాటిని చూపించి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని కూల్చేస్తామన్నారు. తీరా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు దొరికిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి ఉండవల్లికి మకాం మార్చాల్సి వచ్చింది. స్వయంగా సీఎం... లింగమనేని గెస్ట్ హౌస్‌ను తన ఇల్లుగా మార్చుకోవడంతో మంత్రి హోదాలో ఉన్న ఉమ సైలెంటైపోయారు.
ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఓ భవనాన్ని, దానికి పక్కనే ఉన్న మరో ప్రాంగణాన్ని ప్రజావేదికను మార్చారు. సీఎం అధికారిక నివాసం పక్కనే ఉండటంతో పార్టీ నేతలు, అధికారులు, కలెక్టర్లతో సమావేశాలు అక్కడే నిర్వహించేవారు. దీనిపై వైసీపీ నానా యాగీ చేసేది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కరకట్టపైన అక్రమ కట్టడంలో నివసించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారని పదేపదే ప్రశ్నించేది. అయినా చంద్రబాబు కానీ ఆయన మంత్రులు, పార్టీ నేతలు కానీ ఎప్పడూ స్పందించలేదు. చివరికి టీడీపీ అధికారం కోల్పోవడం, వైసీపీ ఘనవిజయం సాధించిన పరిస్థితుల్లో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం ప్రజావేదిక విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రతిపక్ష నేతగా తాను ఓ ప్రైవేటు భవనం లీజుకు తీసుకుని ఉంటున్నానని, మాజీ సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఉన్న తనను కలిసేందుకు వచ్చే వారితో సమావేశాల కోసం ప్రజావేదికను తమకు కేటాయించాలని ఈ మధ్యే చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ఏం నిర్ణయం తీసుకోకుండా కొంతకాలంగా మౌనంగా ఉన్న వైసీపీ సర్కారు... శుక్రవారం హఠాత్తుగా CRDA అధికారులను అక్కడికి పంపింది. వారు అధికారికంగా ప్రజావేదికను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వకుండా... మౌఖిక ఆదేశాలతోనే ప్రజావేదిక ఖాళీ చేయాలని టీడీపీ నేతల్ని కోరారు. అందుకు కుదరదన్న టీడీపీ నేతలు... తమకు నోటీసులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. చేసేది లేక ఇవాళ మరోసారి నోటీసులతో వెళ్లాలని అధికారులు నిర్ణయించారు.
ప్రజావేదికను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉన్నాయి. ఇందులో మరో వాదన లేదు. అయితే ఐదేళ్లుగా ప్రజావేదిక సహా సీఎం నివాసాన్ని కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడంగా విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు అందులోనే కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో లేనప్పుడు ఒకలా... అధికారంలో ఉండగా మరోలా వ్యవహరించడం ఏంటన్న వాదన వినిపిస్తోంది. గతంలో టీడీపీ కూడా ఇదే తరహాలో అధికారంలో లేనప్పుడు అక్రమ కట్టడంగా విమర్శలు చేసి తర్వాత దాన్నే సీఎం అధికారిక నివాసంగా మార్చుకుంది. దీన్ని బట్టీ చూస్తే అధికారాన్ని బట్టి అక్రమాలు సక్రమాలుగా మారిపోతాయా అన్న వాదన సాధారణ ప్రజల నుంచి వినిపిస్తోంది.
Comments
Post a Comment