టన్నుల కొద్ది చెత్త.. కోటీశ్వరుల పెళ్లి వేడుకా మజాకా..

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా ఉత్తరాఖండ్‌లో జరిగిన రెండు పెళ్లిళ్లు అక్కడి మున్సిపల్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. దాదాపు రూ.200కోట్లతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిళ్లు.. దాదాపు 40క్వింటాళ్ల చెత్తను మిగిల్చాయి. ఇప్పుడీ చెత్తను ఊడ్చి పారేయడం మున్సిపల్ అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్ద సవాల్‌గా మారింది.

దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ గుప్తా కుటుంబాలకు చెందిన రెండు పెళ్లిళ్లు జూన్ 18-20, 20-22 తేదీల్లో ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతంలో జరిగాయి.అజయ్ గుప్తా కుమారుడు సూర్యాకాంత్, అతుల్ గుప్తా కుమారుడు శశాంక్ పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతకుముందు, ఈ పెళ్లిళ్లపై కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు.భారీ ఖర్చులతో జరిపే పెళ్లిళ్లు పర్యావరణానికి ప్రతికూలమని అందులో పేర్కొన్నారు. అయితే కోర్టు ఇందులో జోక్యం చేసుకోకపోవడంతో అనుకున్న తేదీలకే పెళ్లిళ్లు జరిగాయి.

కత్రినా కైఫ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు, యోగా గురు బాబా రాందేవ్, ఇతర రంగాలకు చెందిన మరికొంతమంది అతిథులు వివాహ వేడుకకు హాజరయ్యారు.పెళ్లిళ్లకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా చాపర్స్ ఏర్పాటు చేశారు.దాదాపుగా అక్కడి అన్ని హోటల్స్, రిసార్టులను పెళ్లికి వచ్చే అతిథులకోసం బుక్ చేశారు. పెళ్లిళ్ల కోసం స్విట్జర్లాండ్ నుంచి పువ్వులు తెప్పించారు. మొత్తం మీద అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిగాయి. అయితే పెళ్లి తర్వాత క్వింటాళ్ల కొద్ది చెత్త మిగలడంతో.. అక్కడి మున్సిపల్ అధికారులు దాన్ని క్లీన్ చేయించడానికి తంటాలు పడుతున్నారు. స్థానిక మున్సిపల్ అధికారి అనిల్, తన 20మంది టీమ్‌తో కలిసి ఇప్పుడీ చెత్తను ఊడ్చి పారేసే పనిలో నిమగ్నమయ్యారు. భారీ ఖర్చులతో పెళ్లిళ్లు చేసుకునే సంపన్న వర్గాలు.. తద్వారా ఏర్పడే చెత్త.. పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?