వైసీపీలో ఆ మహిళ నేత టార్గెట్ అవుతున్నారా... ఏం జరిగింది ?
ఏపీలో తిరుగులేని విజయం సాధించిన వైసీపీ... కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఓడింది. దీనిపై పోస్టుమార్టం మొదలుపెట్టిన వైసీపీ నేతలు... ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వైసీపీలో చేరిన మహిళా నేతను ఎమ్మెల్యే అభ్యర్థి టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ తరపున అచ్చెన్నాయుడు విజయం సాధించిన టెక్కలిలో వైసీపీ తరపున అభ్యర్థి పేరాడ తిలక్ బరిలోకి దిగారు. ఆయనకు వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అంటే రాజకీయంగా పొసగదనే టాక్ ఉంది. ఈ ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన ముసలం టెక్కలి రాజకీయాల్లో సెగలు రాజేస్తోంది. ఎన్నికలకు ముందు కృపారాణి వైసీపీలో చేరారు.
అయితే జిల్లా అంతటా వైసీపీ గెలిచినా టెక్కలిలో మాత్రం ఓడిపోయింది. ఇదే ఇప్పుడు శ్రీకాకుళం నేతల మధ్య విభేదాలు పెరగడానికి కారణమైంది. తన ఓటమికి కిల్లి కృపారాణి కూడా ఓ కారణం అని పేరాడ తిలక్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడటంతో వివాదం మొదలైంది. ఈ విషయంపై అధినేత జగన్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన వ్యాఖ్యానించారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కిల్లి కృపారాణి... తానే తిలక్‌పై జగన్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి శ్రీకాకుళం ఎంపీ స్థానం ఓటమిపై అసంతృప్తితో ఉన్న వైఎస్ జగన్... జిల్లా నేతలకు క్లాస్ తీసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
Comments
Post a Comment