అధికారులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చుక్కలు చూపిస్తున్నారు
న్యూఢిల్లీ
అధికారులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చుక్కలు చూపిస్తున్నారు. నార్త్ బ్లాక్‌లో ఆయన అడుగుపెట్టినప్పటి నుంచి రోజులో ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతున్నారు. ఉదయం 9:45 గంటలకు ఠంచనుగా ఆఫీసుకు చేరుకుంటున్న ఆయన రాత్రి పదీ- పదిన్నర గంటల వరకూ ఉంటున్నారు.
లంచ్ కూడా ఆఫీసులోనే! మధ్యాహ్నం 12: 45కు లంచ్ బ్యాగ్ ఆయన టేబుల్ వద్దకే వస్తుంది. ఇంటికి వెళ్లడం లేదు. అన్ని సమావేశాలూ ఆఫీసులోనే నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఆయనతో పాటు ఇద్దరు సహాయమంత్రులు, అధికారులు కూడా ఎక్కువ సేపు ఆఫీసులోనే ఉండాల్సి వస్తోంది.
అమిత్ షా వెళితేగానీ సీనియర్ అధికారులెవరూ కదలడానికి వీల్లేదు. ఆయన వేగాన్ని అందుకోలేక అధికారులు సతమతమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పండగలైనా, పబ్బాలైనా, ఆఖరికి సెలవుదినాలైనా ఆఫీసులోనే..! ఆ రోజుల్లో కూడా ఉదయాన్నే ఆఫీసుకు చేరుకుంటున్నారు.
గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల్లోని కీలక మంత్రులు... అందరితోనూ నిరంతరం సమావేశాల్లో గడుపుతూ, అనేక ఇన్‌పుట్స్ తీసుకుంటూ, వాటిని తన జూనియర్ మంత్రులకు, అధికారులకు బదలాయిస్తూ పనిలో తలమునకలవుతున్నారు.
ఇంతకుమునుపు హోంమంత్రిగా పనిచేసిన రాజ్‌నాథ్ సింగ్ చాలా సమావేశాలు అధికారిక నివాసంలో నిర్వహించేవారు. ప్రతి రోజూ లంచ్‌కు ఇంటికెళ్లేవారు. ఒక్కోసారి తిరిగి వచ్చేవారు కాదు. ఇంటినుంచే పని చేసేవారు. కానీ అమిత్ షా అలా కాదు. పగలంతా ఆఫీసే. ఓ రకంగా అమిత్ షా కార్యాలయం కేంద్ర ప్రభుత్వంలో అతి పెద్ద అధికార కేంద్రం.
అక్కడికొచ్చి ‘కనబడి’ వెళ్లనివారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొందరు అధికారులైతే ‘‘ఇది డిప్యూటీ ప్రధాని కార్యాలయం’’ అని వ్యాఖ్యానిస్తున్నారు. అమిత్ షా రాకతో జాతీయ భద్రతాసలహాదారు అజిత్ డోభాల్ పాత్ర పరిమితంగా మారింది. గతంలో అన్ని కీలక వ్యవహారాలూ డోభాల్ చేతుల మీదుగానే సాగేవి.
అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా మాత్రమే షా ఉండడం వల్ల, మంత్రి కాకపోవడం వల్ల డోభాల్‌పైనే ప్రధాని మోదీ ఎక్కువ ఆధారపడేవారు. ఇప్పుడు అంతర్గత భద్రత, సీబీఐ, ఐబీ మొదలైన వాటిపై ప్రత్యక్ష పర్యవేక్షణ షా కనుసన్నల్లోనే సాగుతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యుడు కూడా కావడంతో ప్రధాన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయన మాటే కీలకమవుతోంది.
ఈ అధికారిక కార్యకలాపాలకు తోడు పార్టీ వ్యవహారాలను కూడా అమిత్ షాయే పర్యవేక్షిస్తుండడంతో పని ఒత్తిడి మరింత పెరిగింది. వివిధ రాష్ట్రాల ఎంపీలు, రాష్ట్ర శాఖల అధిపతులు, బీజేపీ సీనియర్లు... ఇలా ఒకటేమిటి తామరతంపరగా సమావేశాలే సమావేశాలు. ‘గత రెండు దశాబ్దాలుగా నేను హోంశాఖ- నార్త్ బ్లాక్ బీట్ కవర్ చేస్తున్నాను. ఇంతలా పనిచేస్తున్న హోంమంత్రిని నేను చూడలేదు’ అని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు.
Comments
Post a Comment