మెడికల్‌ అడ్మిషన్లకు నేటి నుంచి దరఖాస్తులు

తొలిసారి నీట్‌ ఆధారంగా ఆయుష్‌ సీట్ల భర్తీ

అమరావతి : ఎంబిబిఎస్‌, బిడిఎస్‌, ఆయుష్‌ అడ్మిషన్లకు ఎన్‌టిఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

నేటి ఉదయం 11 గంటల నుంచి ఈనెల 28 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వర్శిటీ రిజిస్ట్రార్‌ అప్పలనాయుడు స్పష్టం చేశారు.

ఏటా ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ సీట్లను మాత్రమే నీట్‌ ర్యాంకు ఆధారంగా వర్శిటీ భర్తీ చేస్తోంది.

ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్‌) యుజి సీట్లను రాష్ట్రప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌లో వచ్చే ర్యాంకు ఆధారంగా ఇప్పటివరకు భర్తీ చేస్తూ వస్తోంది.

తొలుత ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ సీట్లు భర్తీ అయిన తర్వాతే ఈ ఆయుష్‌ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఈ విద్యా సంవత్సరం నుంచి తొలిసారి ఆయుష్‌ సీట్లను నీట్‌ ర్యాంకు ఆధారంగా యూనివర్శిటీ భర్తీ చేయనుంది.

ఇప్పటికే నీట్‌లో మన రాష్ట్రం నుంచి అర్హత సాధించిన వారి జాబితాను యూనివర్శిటీ ప్రకటించిన సంగతి విదితమే.

ఇక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత సర్టిఫికెట్లను పరిశీలించి, ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితాను వర్శిటీ అధికారులు సిద్ధం చేయనున్నారు.

అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాత తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

ఈసారి ఎంబిబిఎస్‌ కౌన్సెలింగ్‌లో ఇడబ్ల్యూఎస్‌ కోటా ప్రకారం పది శాతం ఉన్నత వర్గాల్లోని పేదలకు సీట్లను కేటాయించనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలల్లో పది నుంచి 25 శాతం సీట్ల పెంపునకు కూడా అధికారులు జాతీయ వైద్య మండలి (ఎంసిఐ)కు పంపారు. 

అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ, పరిశీలన, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత కౌన్సెలింగ్‌ సమయానికి సీట్ల పెంపు పూర్తవుతుందని వర్శిటీ అధికారులు చెబుతున్నారు.

అందువల్ల ఇడబ్ల్యుఎస్‌ కోటా కింద వచ్చే అదనపు సీట్లను ఆ కేటగిరీ అభ్యర్థులకు కేటాయిస్తామని అంటున్నారు.

ప్రభుత్వ వైద్యకళాశాలల్లోని సీట్లకు మాత్రమే ఈ కోటా కింద రిజర్వేషన్లు అమలవుతాయని అధికారులు చెబుతున్నారు.

ఇక ఆ పది శాతం సీట్లలో ఐదు శాతం కాపులకు, మిగిలిన ఐదు శాతం ఇతర ఉన్నతవర్గాల్లోని పేదలకు రిజర్వేషన్‌ కల్పించేలా గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించి, రాష్ట్రపతి ఆమోదానికి పంపిన సంగతి తెలిసిందే.

రాష్ట్రప్రభుత్వ నిర్ణయం మేరకు కాపులకు 5 శాతం కేటాయించే సీట్లపై స్పష్టత వస్తుందని వర్శిటీ అధికారులు అంటున్నారు.

26న ఆర్‌విఎస్‌ విద్యార్థులకు కౌన్సిలింగ్‌
ఆర్‌విఎస్‌ మెడికల్‌ కాలేజీ విద్యార్థులను ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసేందుకు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

ఈనెల 26న ఆ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

వారి మెరిట్‌ ఆధారంగా రీలొకేట్‌ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?