చిత్తూరు నగరపాలక పరిధిలో రెండు పట్టణ స్థాయి సమాఖ్యలు

చిత్తూరు నగరపాలక పరిధిలో రెండు పట్టణ స్థాయి సమాఖ్యలు, 90 స్లమ్‌ లెవెల్‌ ఫెడరేషన్‌లు ఏర్పాట య్యాయి. వీటి ఆధ్వర్యంలో దాదాపు 2,632 డ్వాక్రా సంఘాలు నడుస్తున్నాయి. వీటిలో 26,320 మంది మహిళలు సభ్యులుగా నమోదయ్యారు. ప్రధానంగా బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా డ్వాక్రా మహిళలు వ్యాపారాల నిర్వహణ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. బ్యాంకు రుణాలను వ్యాపారాభివృద్ధికి, కుటుంబ అవసరాలకు వెచ్చించడంతో బాటు ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేయడం వీరి దైనందిన కార్యక్రమాలు. ఈ నేపథ్యంలో సమాజ సేవలో తమవంతు భాగస్వాములు కావాలన్న తలంపుతో చిత్తూరు నగర మహిళా సమాఖ్య ఓ ఆదర్శ కార్యక్రమానికి 2009లో శ్రీకారం చుట్టింది. ‘గుప్పెడు బియ్యం’ పేరుతో ప్రతి నెల బియ్యాన్ని సేకరించి అనాథలు, వృద్ధులు, ఆకలితో అలమటించే అభాగ్యులకు అందజేస్తోంది.
నగరంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటైన డ్వాక్రా సంఘాలు ప్రతి నెల ఎక్కడికక్కడ నిర్వహించే సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ సమావేశానికి వచ్చే ప్రతి మహిళా తన ఇంటి నుంచి గుప్పెడు బియ్యాన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంచిలో వేయాలి. ఇలా ప్రతి సంఘం నుంచి సేకరించిన బియ్యాన్ని ఆయా పొదుపు సంఘాల ప్రతినిధులు ప్రతి నెల 25వ తేదీ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే నగర సమాఖ్య సమావేశానికి తీసుకొస్తారు. ఇలా తెచ్చిన బియ్యాన్ని బస్తాల రూపంలో సిద్ధం చేసి అభాగ్యులకు పంపిణీ చేస్తారు. ప్రతి నెల సేకరించే బియ్యం ఒక టన్ను వరకు ఉంటుంది. గత పదేళ్లుగా 1.40లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించారు.
పొదుపుతో ఆర్థిక స్వావలంబన సాధించిన మహిళలు ఏకంగా సమాజ సేవకు నడుం కట్టారు.. మహిళా సమాఖ్యల్లో సభ్యులుగా ఉండి వితంతువు, అనాథలుగా మారిన మహిళలు.. భిక్షాటనతో చాలీచాలని ఆహారంతో జీవిస్తున్న వృద్ధులకు తాము సేకరించిన బియ్యంతో కాసింత అన్నం పెడుతూ వారి క్షుద్బాధ తీరుస్తున్నారు.. కేవలం గుప్పెడు బియ్యంతో పేదలు, అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నారు చిత్తూరుకు చెందిన డ్వాక్రా మహిళలు.
సంతృప్తి ఇస్తోంది
డ్వాక్రా సంఘాల పరిధిలోని సభ్యులకు స్వయం ఉపాధి రుణాల మంజూరుతో పాటు సమాజ సేవలోనూ పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తున్నాం. దీనిలో భాగంగానే గుప్పెడు బియ్యాన్ని ప్రతి నెల మహిళల ద్వారా సేకరించి పేదలకు పంపిణీ చేయిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు ఈ కార్యక్రమం సంతృప్తినిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నాం. - కృష్ణవేణి, మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌
ఎక్కువ మంది పేదలకు..
గుప్పెడు బియ్యాన్ని తీసుకొచ్చే మహిళల సంఖ్య పెరుగుతోంది. కొత్త సంఘాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో మహిళా సభ్యుల సంఖ్యా పెరుగుతోంది. దీంతో బియ్యం సేకరణ సామర్థ్యం పెరిగి ఎక్కువ మంది పేదలకు సేవ చేసే అవకాశం ఉంటుంది.
- ప్రియ, అధ్యక్షురాలు, భరతమాత పట్టణ మహిళా సమాఖ్య
సమాజ సేవలో..
దైనందిన కార్యక్రమాలతో పాటు సమాజంలో ఆదరణకు నోచుకోని అభాగ్యులకు సాయం చేయాలన్నదే లక్ష్యం. అందుకే గుప్పెడు బియ్యం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సభ్యుల నుంచి స్పందన లభిస్తోంది. - లలిత దేవి, కార్యదర్శి, భరతమాత పట్టణ మహిళా సమాఖ్య

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?