నిత్య పెళ్లి కూతురు కేరాఫ్ నెల్లూరు..
పెళ్లి పేరుతో యువకులను వలలో వేసుకుని వారి దగ్గరనుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది ఓ నెల్లూరు నెరజాణ. నెల్లూరు జిల్లా ఇమనడుకుకి చెందిన కోరం అర్చన (30) ఈ మోసాలకు పాల్పడింది. ఎస్వీ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన అర్చన, నెల్లూరు రంగనాయకులు పేటకు చెందిన ఓ వ్యక్తితో వివాహం అయిన తర్వాత హైదరాబాద్ కి మకాం మార్చింది. కుటుంబానికి దూరంగా హాస్టల్ లో ఉంటూ సైబర్ మోసాలకు పథకం రచించేది. అందమైన ఫొటోలతో.. విదేశాల్లో ఉంటున్న వరుడు కావాలని వివాహ వెబ్‌సైట్లలో ప్రొఫైల్ ఉంచేది. స్పందించే వరుడు, వారి తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని వారితో ఫోన్లోనే మాటలు కలిపేది. తనను ఫోన్‌లో సంప్రదించే వరులు, తల్లిదండ్రులను.. నిశ్చితార్థానికి రింగులు, ఆభరణాలంటూ ఉచ్చులో దించుతుంది. వారిని నేరుగా కలవకుండా జాగ్రత్తపడుతూ ఫోన్, ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు సాగిస్తుంది. తన ఫోన్ నంబరు విదేశానిదే వినియోగిస్తుంది. తల్లి, తండ్రి, కుటుంబ సభ్యుల మాదిరిగా గొంతులు మార్చి తానే మాట్లాడేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌లను ఉపయోగించుకుంటోంది. పెళ్లికి ముందుకు వచ్చే వరులు, వారి తల్లిదండ్రుల వద్ద నగలు, దస్తులు తదితరాల కోసమంటూ భారీ మొత్తాల్లో ఖాతాలో జమ చేయించుకుంటుంది. డబ్బులు ఖాతాలో పడగానే అందుబాటులో లేకుండా పోతుంది.
బాధితుల నుంచి ఫిర్యాదుతో..
ఓ కుటుంబాన్ని ఇటీవల అర్చన ఇలాగే వంచించింది.. అమెరికాలో ఉంటున్న తమ కుమారుడికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఓ వెబ్‌సైట్లో ఆమె పుష్తయి పేరుతో పోస్టు చేసిన ప్రొఫైల్ ఆధారంగా వారు ఆమెను సంప్రదించింది. తల్లిదండ్రుల నుంచి కుమారుడి ఫోన్ నంబరు తీసుకుని అతడితో చాటింగ్, ఫోన్లో మాట్లాడటం మొదలు పెట్టింది. నమ్మకం కుదిరాక నిశ్చితార్థానికి చీర, ప్లాటినం ఉంగరం కావాలని కోరింది. దీంతో అతడు రూ. 1.5 లక్షలు ఆమె ఖాతాలో జమ చేశాడు. తర్వాత ఆమె అందుబాటులో లేకుండాపోయింది. దీంతో వారు గతనెల 18న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబరు, ఖాతా నంబరు, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా.. ఇన్‌స్పెక్టర్ రామయ్య నిందితురాలిని పట్టుకున్నారు.
గతంలో పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడుతుండగా సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. 2018లో 5 నెలలపాటు జైలులో ఉంది. డిసెంబరులో విడుదలై వచ్చి తిరిగి అదే పని మొదలుపెట్టి మరోసారి పట్టుబడింది.
Comments
Post a Comment