కొత్త తరహా సైబర్ నేరం_ఆ నాలుగు అంకెలూ జాగ్రత్త
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్.. సంక్షిప్తంగా.. యూపీఐ... నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో వచ్చిన ఈ సౌకర్యం ఇప్పుడు సైబర్ మోసగాళ్లకు కొత్త ఆయుధంగా మారింది. యూపీఐ గుర్తింపును, రహస్య సాంకేతిక సంఖ్య (ఎంపిన్)ను తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ వినియోగిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
‘మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. మీ కార్డు వివరాలు చెప్పండి’ అంటూ వచ్చే ఫోన్లు మోసం అంటూ ఎంత అవగాహన కల్పిస్తున్నా.. రోజుకు ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలబారిన పడి, ఖాతాల్లో నుంచి సొమ్మును పోగొట్టుకుంటున్న వారు ఉంటూనే ఉంటారు. అవగాహన పెరగడం, సాంకేతికంగా కొత్త మార్పులు రావడంతో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ నగదు లావాదేవీలను నిర్వహిస్తున్న వారి వివరాలను తెలుసుకొని, వారి ఖాతాల్లో నుంచి లక్షల్లో బదిలీ చేసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) యాప్ వినియోగిస్తున్న వారందరూ భవిష్యత్తులో సైబర్ నేరస్థులకు లక్ష్యాలేనని పోలీసులు, సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్రెడిట్/డెబిట్ కార్డులకు బదులుగా ఇప్పుడందరూ మొబైల్ వ్యాలెట్లను వినియోగించడం ప్రారంభించారు. గతంలో ఈ వ్యాలెట్ల ద్వారా రూ.5,000 వరకే నగదు లావాదేవీకి పరిమితి ఉండేది. మోసగాళ్లు ఈ లావాదేవీలు నిర్వహించే వారికి పదేపదే ఫోన్లు చేసి, ఏదో ఒక కారణం చెప్పి, వారి ఓటీపీలను అడిగి తీసుకునేవారు. యూపీఐ అందుబాటులోకి రావడంతో ఈ మొత్తం పెరిగింది. దీంతో మోసపోయినప్పుడు కోల్పోతున్న నగదు పెద్ద ఎత్తున ఉంటోంది.
సౌలభ్యం మాటునే మోసం..
ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు వేగంగా నగదు బదిలీ చేయడం, ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్లును చెల్లించేందుకు, ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించడం ఇలా పలు సందర్భాల్లో ఇప్పుడు యూపీఐ ఎంతో కీలకమైంది. కార్డులను వినియోగించాల్సిన అవసరం లేకపోవడం, కేవలం మొబైల్ ఫోనుతోనే లావాదేవీలు నిర్వహించగలగడం తదితర సౌకర్యాలతో అనతి కాలంలోనే ఇది అత్యంత ఆదరణ పొందింది. అవతలి వ్యక్తి తన ఖాతాకు అనుసంధానం అయిన మొబైల్ నెంబరు మనకు చెబితే చాలు.. దాని ఆధారంగా డబ్బు పంపించేయొచ్చు. దీనికి పరిమితి కూడా రూ.లక్ష వరకూ ఉండటంతో లావాదేవీలను నిర్వహించడం సులభం అవుతోంది. దీన్నే మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ వ్యాలెట్లు, యూపీఐ ఆధారిత యాప్‌లను వినియోగిస్తున్న వారితోనే మాట్లాడి, బ్యాంకు లావాదేవీల్లో సహకరిస్తామంటూ నమ్మించి, వారి ఖాతాల నుంచి రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు.
పాస్‌వర్డ్ మారే వరకూ..
గతంలో ఆన్‌లైన్, మొబైల్ వ్యాలెట్ల ద్వారా వస్తువులు కొన్నా, నగదు బదిలీ చేసినా.. ఖాతా ఉన్న బ్యాంకు నుంచి ఓటీపీ (వన్ టైం పాస్‌వర్డ్) మొబైల్‌కు వచ్చేది. ఈ ఓటీపీ కాలపరిమితి 15 నిమిషాలు మాత్రమే ఉండేది. ఈ వ్యవధిలో లావాదేవీ పూర్తి కాకపోతే అది దానంతట అదే రద్దయ్యేది. యూపీఐ అందుబాటులోకి వచ్చాక మొబైల్ వ్యాలెట్లలో ఒకసారి లావాదేవీ పరిమితి రూ.లక్ష వరకూ పెరిగింది. ఓటీపీ అవసరం కూడా లేకుండా పోయింది. ఖాతాకు అనుసంధానంగా ఉన్న మొబైల్ నెంబరు ఉన్న ఫోనులో యూపీఐ ఆధారిత యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకొని, వర్చువల్ ఐడీ, దానికో నాలుగు అంకెల పిన్ ఏర్పాటు చేసుకుంటే చాలు. ఇక దాని నుంచే అన్ని లావాదేవీలూ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ తెలుసుకోవడం, ఖాతా వివరాలు, నగదు స్వీకరించడం, బదిలీ చేయడం ఇలా అన్ని పనులూ చక్కబెట్టుకోవచ్చు. ఈ పిన్ గతంలోలాగా 15 నిమిషాలు కాకుండా.. మనంతట మనం మార్చుకునేంత వరకూ అదే కొనసాగుతుంది. సైబర్ నేరస్థులు దీన్నే అవకాశంగా మార్చుకుంటున్నారు. బ్యాంకు అధికారులమంటూ ఒకసారి, మొబైల్ వ్యాలెట్ వినియోగదారుల కేంద్రం నుంచి అంటూ మరోసారి ఫోన్లు చేస్తుంటారు. వారు అడిగిన వివరాలు చెప్పడం, పంపిన వెబ్‌లింకులను తెరవడం లేదా, అందులో నాలుగంకెల రహస్య సంఖ్యను నమోదు చేయడం ఇలా వారి మాటల మాయలో పడి, వారు చెప్పిందల్లా చేసేస్తే.. మన ఖాతాలో నగదు వారి జేబులోకి వెళ్లిపోతుంది.
డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా మోసం జరిగినప్పుడు బ్యాంకుకు ఫోన్ చేస్తే వెంటనే ఆ కార్డులను స్తంభింప చేస్తారు. కానీ, యూపీఐ, మొబైల్ వ్యాలెట్ల విషయంలో ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. మనం పాస్‌వర్డ్ లేదా వర్చువల్ ఐడీ మార్చేంత వరకూ మోసగాళ్లకు అడ్డు ఉండదు.
పేరు చెప్పారని నమ్మొద్దు..
డెబిట్‌కార్డుల నుంచి రూ.వేలు, లక్షలు నగదు బదిలీ చేసుకునే నేరగాళ్లు బ్యాంకులకు పొరుగు సేవలనందించే సిబ్బందిని ప్రలోభపెట్టి, ఆయా బ్యాంకుల్లోని ఖాతాదారుల వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాదార్లకు ఫోన్లు చేసేందుకు వందల సంఖ్యలో సిమ్ కార్డులు తీసుకుంటారు. డెబిట్/క్రెడిట్ కార్డుదారులకు ఫోన్ చేసి, పేరు.. కార్డులోని మొదటి నాలుగో.. చివరి నాలుగు అంకెలో చెప్పేస్తారు. ఇవి నిజమే అవడంతో అనుమానం రాదు. వివరాలు చెప్పడానికి నిరాకరించిన సందర్భంలో.. ప్రధానమంత్రి బీమా యోజన,
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తదితర పథకాలకు ఇబ్బంది వస్తుందని బెదిరిస్తుంటారు. చదువుకున్నవారు, సైబర్‌నేరాలపై అవగాహన ఉన్నవారు మాత్రం వీరి నుంచి తప్పించుకుంటుండగా.. విద్యార్థులు, యువతులు, మహిళలు, పదవీ విరమణ చేసిన వారు మోసగాళ్ల వలలో చిక్కుతున్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు పలు రక్షణ చర్యలు తీసుకున్నా.. రోజుకో కొత్త తరహా మాయలతో మోసగాళ్లు పలువురి కష్టార్జితాన్ని కొల్లగొడుతూనే ఉన్నారు.
90 రోజులకోసారి..
ఈ మెయిల్, మొబైల్ ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్, బ్యాంకు ఆన్‌లైన్ పాస్‌వర్డ్ ఇలా ఏదైనా సరే.. రహస్యంగా ఉండాలంటే.. వాటిని వెంటవెంటనే మార్చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. పాస్‌వర్డ్‌లు, రహస్య సంకేత నామాలను కనీసం 90 రోజులకోసారైనా మార్చుకుంటేనే సైబర్ నేరస్థుల నుంచి తప్పించుకోవచ్చు. ఎంతటి ఘరానా సైబర్ నేరస్థులకైనా సరే.. బ్యాంక్ ఖాతాదారుల పేర్లు, ఫోన్ నంబరు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాల వరకు మాత్రమే తెలుసుకునే అవకాశాలున్నాయి. అంతేకానీ మన ఖాతాల్లోంచి నగదును బదిలీ చేసుకోవడం సాధ్యం కాదు. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, ఇతర వ్యక్తిగత వివరాలు చెప్పడం వల్లే 99శాతం మంది బాధితుల ఖాతాల్లోంచి సైబర్ నేరస్థులు నగదు బదిలీ చేసుకుంటున్నారని సైబర్ నిపుణులు, పోలీసులు పేర్కొంటున్నారు.
ఎన్నన్ని గుర్తు పెట్టుకుంటామంటూ.. చాలామంది వీటిని మార్చేందుకు ఇష్టపడరు. మరికొందరు అన్నింటికీ ఒకటే మంత్రం అన్నట్లు.. ఒకే పాస్‌వర్డ్, సంఖ్యను పెట్టేస్తుంటారు. ఇది సురక్షితం కాదు.
బ్యాంకులనే సంప్రదించండి..
ఆన్‌లైన్, మొబైల్ వ్యాలెట్ ఆధారిత నగదు లావాదేవీలు నిర్వహిస్తున్న లక్షల మంది ఖాతాదారుల వివరాలు సైబర్ నేరస్థుల వద్ద ఉన్నాయి. వారు మోసపూరితంగా నగదును కొల్లగొట్టేందుకు ఫోన్లు చేస్తున్నారు. విషయం తెలియకుండా.. వారి మాటలకు మోసపోయి చాలామంది పాస్‌వర్డ్, పిన్ నెంబర్లు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఎవరైనా ఫోన్ చేసి కార్డు మార్చాలి, పిన్ నంబరు చెప్పండి అంటే నమ్మకూడదు. ‘బ్యాంకు అధికారులు ఎప్పుడూ నేరుగా ఖాతాదారులకు ఫోన్ చేయరు’ ఈ ఒక్క విషయంపై అవగాహన పెంచుకుంటే చాలు. మీ నగదు లావాదేవీలు, డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన వ్యవహరాలను సమీపంలోనే బ్యాంకు శాఖకు వెళ్లి తెలుసుకునే అవకాశాలున్నాయి. మీకు అనుమానం వచ్చిన వెంటనే బ్యాంకుకు నేరుగా వెళ్లండి. మోసపోయామని గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
Comments
Post a Comment