హెరిటేజ్ నెయ్యితో వైవీ సుబ్బారెడ్డి తులాభారం..
ఔను. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు 50వ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి హెరిటేజ్ నెయ్యితో తులాభారం వేశారు. టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఇవాళ ఆయన ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం శ్రీనివాసుని సన్నిధిలో ఉన్న త్రాసులో తులాభారం వేశారు. శ్రీవారికి మొక్కుకునే భక్తులు ఇలా తులాభారం వేసి.. తమకు సరిపడా బరువైన బెల్లం, బియ్యం వంటి వాటిని స్వామివారికి సమర్పిస్తారు. అలాగే, వైవీ సుబ్బారెడ్డికి కూడా తులాభారం వేశారు. అయితే, ఆయనకు నెయ్యితో తులాభారం వేయించారు. అక్కడ హెరిటేజ్ నెయ్యితో తులాభారం వేయించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హెరిటేజ్ ఫుడ్స్.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుకి చెందిన సంస్థగా చెబుతారు. గతంలో వేసవి కాలం సందర్భంగా ప్రజలకు పంచేందుకు మజ్జిగ ప్యాకెట్లును హెరిటేజ్ సంస్థ నుంచి కొనుగోలు చేశారు. అప్పుడు పెద్ద దుమారం రేగింది. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు హెరిటేజ్ సంస్థకు ఉంది. దీంతో ఆ కంపెనీ సరఫరా చేసిన నెయ్యితోనే వైవీ సుబ్బారెడ్డికి తులాభారం నిర్వహించారు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హోమం నిర్వహించినప్పుడు కూడా అందులో వాడే నెయ్యిని హెరిటేజ్ నుంచే తీసుకొచ్చారు.
Comments
Post a Comment