ఓ యువజంట చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య
ప్రేమ విషయం ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో ఓ యువజంట చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహాబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం కనాయపల్లిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయిలకొండ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన రవి(19), రాధిక(20) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రవి డిగ్రీ రెండో సంవత్సరం, రాధిక డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నారు. వీరిద్దరి ప్రేమ విషయం వారి తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. దీంతో తల్లిదండ్రులు తమను విడదీస్తారనే భయంతో ఈ ఏడాది మార్చి 21న ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీనిపై.. ఇరు కుటుంబాల వారు మార్చి 23న కోయిలకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారి జాడ తెలియలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కనాయపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరులు కొందరు గ్రామ సమీపంలో ఉన్న ఎలిగలగట్టు గుట్టపై చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా సమాచారం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. చెట్టుకు వేలాడుతున్నవి రవి, రాధిక మృతదేహాలుగా గుర్తించడంతో ఆత్మహత్యల మిస్టరీ వీడింది. ఈ మేరకు కేసు నమోదుచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Post a Comment