జిల్లా:దేశంలో అనాథ పిల్లల సంఖ్య కోటి ఉన్నట్లు అంచనా.

అనంతపురం జిల్లా:దేశంలో అనాథ పిల్లల సంఖ్య కోటి ఉన్నట్లు అంచనా.. అలాగే పిల్లలు లేని దంపతుల సంఖ్య సుమారుగా 1.20 కోట్లు. సంతానం లేక ఆత్మన్యూనతతో జీవిస్తున్న దంపతుల ఒడికి అనాథ పిల్లలను చేర్చడమే తమ కర్తవ్యమని ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ జాతీయ అధ్యక్షురాలు మమత గుప్త తెలిపారు. కోల్‌కతా నుంచి వచ్చిన ఆమె శనివారం రోటరీక్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో అనాథ పిల్లల సంఖ్య ఏటేటా పెరిగిపోతోందన్నారు. వీరిని సంతానలేమి దంపతులకు చట్టబద్ధంగా దత్తత ఇప్పించడానికి ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ సభ్యులు వారధిలా పనిచేస్తారని ఆమె వివరించారు. మన దేశంలో 27 ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ల్లో 46 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. క్లబ్‌ స్థాపించి 2024 నాటికి వందేళ్లవుతుంది. అప్పటికల్లా అనాథలను అమ్మఒడికి చేర్చే ప్రక్రియను పూర్తి చేయాలని సంకల్పించినట్లు ఆమె వివరించారు. అనాథ శరణాలయాల్లో పెరిగే పిల్లలను నెలలో మూడురోజుల పాటు ఇంటికి ఆహ్వానించి సొంత పిల్లలతో సమానంగా చూసుకునే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల వారికి తల్లిదండ్రులు లేరన్న లోటు కొంత తీరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే పాఠశాలల్లో చదివే బాలికల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పర్యావరణానికి ప్రమాదంగా మారిన ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జనపనార, కాటన్‌ దుస్తులతో తయారు చేసిన సంచులు అందుబాటులోకి తెస్తామని ఆమె పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షురాలు శ్రీవల్లి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. జిల్లాలో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో సభ్యులు అరుంధతి, శ్రీలత, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?