యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. తిరస్కరించేసరికి

హైదరాబాద్‌:

సన్నిహితంగా మాట్లాడినందుకు ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. తిరస్కరించేసరికి వాట్సాప్‌లో ఆ ఇద్దరిపై అసభ్య ప్రచారానికి తెర లేపాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. రాచకొండ సైబర్‌క్రైం ఏసీపీ హరినాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పానగల్లు తెల్లరాళ్లపల్లికి చెందిన మండపురం నాగరాజు(25) నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగి. కాలేజీ రోజుల్లో ఓ యువతితో పరిచయం కావడంతో తరచూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడేవాడు. ఆమె స్నేహితురాలితోనూ పరిచయమై ఇద్దరితో మాట్లాడటం ఆరంభించాడు. ఫోన్‌లో వారిద్దరు చనువుగా మాట్లాడటంతో ప్రేమగా భ్రమించాడు. ఈ క్రమంలో వారి ఫొటోలను సేకరించాడు. ముందుగా యువతి స్నేహితురాలితో మూడు నెలల కిందట తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆమె తోసిపుచ్చింది. తర్వాత కొన్ని రోజులకు ఆమె స్నేహితురాలితోనూ తన ప్రేమను ప్రతిపాదించాడు. అక్కడా తిరస్కరణ ఎదురుకావడంతో రాత్రి సమయాల్లో వారికి ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడటం ఆరంభించాడు. కొన్నిరోజులు అతడి ఆగడాలను భరించిన బాధితురాళ్లు.. అతడి ఫోన్లకు స్పందించడం మానేశారు. దీంతో నాగరాజు మరింతగా రెచ్చిపోయాడు. ఆ యువతులిద్దరు కలిసి ఉన్న చిత్రాన్ని తన వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. అసభ్యంగా క్యాప్షన్‌ పెట్టాడు. విషయం తెలిసి బాధితురాళ్లు అతడిని నిలదీశారు. ‘నన్ను ప్రేమించు.. లేదంటే పెళ్లి చేసుకో’ అంటూ ఇద్దరినీ బెదిరించాడు. లేకపోతే అంతు చూస్తానని హెచ్చరిస్తుండటంతో వారు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ జలేంధర్‌రెడ్డి మంగళవారం శివరాంపల్లిలో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?